రెండవ భాగం

వేదిక: వైకుంఠం

మరునాడు యమధర్మరాజు వైకుంఠానికి పయనమయ్యాడు, ప్రధానద్వారం దగ్గర ఇంద్రుడు కూడా కలవడంతో- “నిర్వాహణ నియమాలు,దౌత్య మర్యాదల” అనంతరం (ప్రోటోకాల్) యమధర్మరాజు, ఇంద్రుడు వైకుంఠంలోని “ఆంతరంగిక సమావేశాల మందిరానికి” చేరుకున్నారు- అప్పటికే విధాత,మహాశివుడు, విష్ణుమూర్తి ముచ్చట్లాడుకుంటున్నారు.

వీళ్ళిద్దరిని చూడగానే త్రిమూర్తులైనా కించిత్ గర్వంలేకుండా యమునికి,ఇంద్రునికి ఉచితాసనాలు చూపించారు(లేనిపోని దర్పాలు, వెధవ్వేషాలన్నీ మనకే అనుకుంటా) త్రిమూర్తులకు వందనాలు సమర్పించి తమకు ఉద్దేశించిన ఆసనాల్లో యమధర్మరాజు,ఇంద్రుడు ఆసీనులయ్యారు -ఉభయకుశలోపరి అయిన తర్వాత!తిన్నగా వెళ్ళగానే విషయం మొదలుపెట్టకుండా.

మహావిష్ణువు యముణ్ణి ఉద్దేశించి “ఏమి యమధర్మరాజా భూలోకపు కబుర్లు, ఏదో ప్రత్యేక మైన విశేషం ఉంటే గాని మీరు మా ముగ్గురికి కబురుపెట్టరు కదా, అందునా ఇంద్రుణ్ణి కూడా వెంట తెచ్చావు ఏమిటి విశేషం " అని నవ్వుతూ అడిగాడు.

“మహాప్రభూ, త్రిమూర్తులైన మీకు తెలియని విషయం ఉంటుందా- ప్రతీ ఒక్కరి మనసులో భావనలు ఇట్టే పసికట్టేస్తారు కదా” అన్నాడు వినయంగా చిరు నవ్వుతో,వాళ్ళ ముగ్గుర్ని ఉద్దేశించి తన మాటలు మొదలుపెట్టాడు యమధర్మరాజు!

“మహానుభావులారా భూలోకంలో మానవులంతా తీరుబడిలేకుండా ఉరుకులు పరుగులతో బతికేస్తున్నారు.సంపాదన, వారి భవిత, వారి పిల్లల భవిష్యతే ధ్యేయంగా- భూమండలం చాలా ప్రగతి సాధించింది కూడా- మానవుడు అధిరోహించని రంగం లేదు-అంగారకగ్రహం మీద కూడా నివాసానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇవన్నీ మీ ఎరుకకు రాని విషయాలేమీ కావు” అని చెప్పి

లిప్తకాలం ఆపి మళ్ళీ తన మాటలు కొనసాగించాడు.

“అయినా కూడా వారిలో దైవ చింతన, భక్తి భావాలు మెండుగానే ఉన్నాయి,అవే కాస్త సేద తీరుస్తున్నాయి వాళ్ళని- విసిగి వేసారినప్పుడు వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితంలో”

అప్పుడు “విరించి” "మరి ఇంక ఇబ్బందే లేదు కదా" మీరాకకు కారణం అన్నట్టుగా మందస్మిత వదనంతో అడిగాడు!

అక్కడికే వస్తున్నా అన్నట్టుగా యముడు"త్రిమూర్తులారా ఈ మధ్యన మనవాళ్ళు భూలోకానికి చేసే రాకపోకలలో కొత్త అనుభవం చూస్తున్నారు మానవులలో.

జీవి ఆయుష్షు అవ్వగానే మనవాళ్ళు అక్కడకి చేరుకొని ఆ శరీరంలో ఉన్న జీవాత్మని తెచ్చేటప్పుడు పోయిన తమ జీవితభాగస్వామి గురించి వాళ్ళు అనుకునే మాటలు వాళ్ళ చెవిన వేసాడు"

ఆ మాటలు విన్న త్రిమూర్తులు “ఆహా,ఇది నమ్మశక్యం కాకుండా ఉన్నదే ఈ కలికాలంలో”అన్నట్టుగా ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

అప్పుడు మహాశివుడు"వాళ్ళ కోరిక సమంజసమే కాకుండా మెచ్చతగినదిగా ఉంది,అది అమలుపెట్టటానికి నాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు" అన్నాడు.

తక్షణమే బ్రహ్మదేవుడు కల్పించుకుని "మహాశివా నీవు లయకారకుడివి కాబట్టి నీకు అది చాలా తేలికైన విషయమే, నీదేముంది, యమధర్మరాజు ఉన్నాడుగా టక్కున అమలుచేయడానికి- నీతపస్సుకి, ధ్యానానికి,కైలాస నాట్యానికి ఏ భంగం లేదు కదా” అని నవ్వుతూ, “అసలు ఇబ్బంది అంతా నాదే కదా" అన్నాడు.

వీరి సంభాషణలు వింటూ చూస్తున్న శ్రీ మహా విష్ణువు చిరునవ్వు నవ్వాడు బ్రహ్మని కొనసాగించమన్నట్టుగా సంజ్ఞ చేస్తూ! “ఏ జీవియొక్క పాపకర్మల ప్రకారం వారివారి ఆయుష్షు నిర్థారిస్తాను.అలాగే ఎవరికి ఎవరితో ఋణానుబంధం ఉంటుందో అనేవి కూడా పరిగణలోకి తీసుకొని ప్రతీ జీవిని తయారుచేసి, ప్రాణంపోసి భూలోకానికి పంపుతాను.ఈ మానవుల కోరిక అభిలషణీయమే అయినా ఆచరణలో కష్టం”

“ఎవరికి ఎవర్ని ఎక్కడ కలపాలో అన్నీ నేనురాసిన ప్రకారం జరుగుతాయి- అందుకనే ఎవరు భూమండలంలో ఏమూల ఉన్నా నా లెక్కలప్రకారం వాళ్ళు కలవడం జరుగుతుంది-వాళ్ళు ఊహించుకోలేనట్లు.ఇదంతా చాలా పెద్ద పని,

చిటికలో అయ్యేదికాదు-మీ వాళ్ళు వాళ్ళప్రాణాలు తెస్తున్నట్టు !” అన్నాడు. శంకరుని వైపు చూస్తూ!

“అదీ కాకుండా అల్పాయుష్కుల్ని దీర్ఘాయుష్కులుగా,దీర్ఘాయుష్కుల్ని అల్పాయుష్కులుగా చేయడం ధర్మ విరుద్ధం- ఆ సంగతి మీకూ తెలుసు. భార్యాభర్తలను- వాళ్ళ సంతానాన్ని, ఆప్తుల్ని, ఇతరులతో బంధాలని- ఋణానుబంధం ప్రకారం సృష్టిస్తాగానీ-అదే ఆయుః పరిమితి ఉన్నవాళ్ళని, ఎవరినిపడితే వాళ్ళని భార్యాభర్తలుగా చేయడం కుదరదు కదా” అన్నాడు.

వారి ఇరువురి సంభాషణలు అయిన తర్వాత మహా విష్ణువు వైపు చూసారు, మీ అభిప్రాయం ఏమిటి అన్నట్టు.

అప్పుడు శ్రీమహావిష్ణువు“మానవుల ప్రవర్తనలో, ఆలోచనలలో మార్పులు సహజం-కొందరికి ఈ కోరిక ఎందుకు కలిగిందో!నడుస్తున్న ఒరవడిలో ఏచిన్న మార్పు తేవాలన్నా సుదీర్ఘంగా ఆలోచించాలి; అయినా ఇదేదో మన ఇంటి వ్యవహారం కాదు, సృష్టి –స్థితి-లయలకు సంబందించినది.ఒక్క మానవులనే కాకుండా సకల జీవరాశులని కూడా దృష్టిలో పెట్టుకుని నడిపే వ్యవహారం" అన్నాడు.

శివుడు బ్రహ్మ ఇద్దరు ఓకేసారి "మరి ఇప్పుడు ఏం చేద్దాం” అన్నారు,విష్ణువు వైపు చూస్తూ ఆయన్ని ఉద్దేశించి. "ఇది సృష్టికార్యం కాబట్టి మన భార్యలతో సంప్రదించి వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కుందాం, మన నిర్ణయం పక్షపాత ధోరణిగానూ,ఏకపక్షంగానూ ఉండకూడదు కాబట్టి.అందుచేత రేపు మళ్ళీ మన అందరం కలుద్దాం లక్ష్మి, సరస్వతి, పార్వతుల అభిప్రాయలు కూడా విని” అన్నాడు-వారివురు సరే అని అన్నారు.

దానితో యమునికి,ఇంద్రునికి విషయం అర్ధం అవటంతో మరునాడు కలుస్తాము అని వారి ముగ్గురి దగ్గర సెలవు తీసుకుని వారిరువురు వాళ్ళ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.బ్రహ్మ సత్య లోకానికి,శివుడు కైలాసానికి మహావిష్ణువు తన అంతఃపురానికి వెళ్ళిపోయారు.

త్రిమూర్తులు వారివారి భార్యలతో చర్చించటానికి మనమూ ఒకరోజు సమయం ఇద్దాం.రేపు వేకువకల్లా నా చెవిన ఎలాగూ వేస్తారు అసలు విషయాన్ని.దాని ప్రకారం దీనికి ముగింపు పలుకుతారేమో వేచిచూద్దాం-రేపటిదాకా వేచిచూద్దాం అందరం!!

అందుకే మరి ఇప్పటికి సశేషం!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!